
వరంగల్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పీఎం మిత్ర (PM MITRA) మెగా టెక్స్టైల్ పార్క్ అమలు పురోగతిపై వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డా. కడియం కావ్య లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్క్‌లో భూసేకరణ, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల ఆకర్షణ, ఉత్పత్తి ప్రారంభం, ఉద్యోగాల కల్పనపై వివరాలు వెల్లడించాలని ఎంపీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యంగా స్థానిక యువత, మహిళలు, ఎస్సీలు, ఇతర వెనుకబడిన వర్గాలకు ఎన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు.
వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా లోక్‌సభలో దేశవ్యాప్తంగా ఏడు పీఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అందులో తెలంగాణలోని వరంగల్‌ను ఒక ప్రాంతంగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. వరంగల్ పార్క్‌ను బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరీలో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
కేంద్రం సమాధానంపై ఎంపీ డా. కడియం కావ్య మాట్లాడుతూ.. వరంగల్ పీఎం మిత్ర పార్క్ కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్టు కాకుండా తెలంగాణలోనే అతిపెద్ద ఉపాధి, పెట్టుబడుల కేంద్రంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. అయితే భవిష్యత్తులో ప్రకటించిన లక్ష్యాలకు అనుగుణంగా పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన వేగంగా పెరగాలని అన్నారు.
వరంగల్‌లోని యువతకు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే నాణ్యమైన ఉద్యోగాలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడమే తన ప్రధాన లక్ష్యమని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, ఎస్సీలు, ఎస్టీలు, బలహీన వర్గాలకు పార్క్‌లో తగిన ప్రాధాన్యత కల్పించేలా కేంద్రం ప్రభుత్వం చర్యలు చేపట్టాలన్నారు.
వరంగల్‌ను జౌళి రంగానికి జాతీయ స్థాయి హబ్‌గా తీర్చిదిద్దేందుకు తాను నిరంతరం కృషి చేస్తానని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య స్పష్టం చేశారు. వరంగల్ ప్రజలకు మరిన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలు తీసుకురావడానికి తన ప్రయత్నాలు నిరంతరం కొనసాగుతాయని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య తెలిపారు.

