
రాజ్యాంగ పరిరక్షణకే ప్రాధాన్యం – అక్రమ కేసులన్నది పచ్చి అబద్ధం: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్
వర్ధన్నపేట మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంపై కాంగ్రెస్ పార్టీ వర్ధన్నపేట మండల అధ్యక్షుడు పోశాల వెంకన్న గౌడ్ తీవ్రంగా స్పందించారు. బిఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలను ఆయన ఖండిస్తూ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ప్రజాస్వామ్య వ్యవస్థలో చట్టం అందరికీ సమానమే
స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ జెండా ఆవిష్కరణ పేరిట ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించడమే కాకుండా, జాతీయ జెండా నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం చట్టరీత్యా నేరమని వెంకన్న గౌడ్ స్పష్టం చేశారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు తమ విధుల్లో భాగంగానే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారని, ఇందులో ఎలాంటి రాజకీయ కక్షసాధింపులు లేవని తేల్చిచెప్పారు.
అభివృద్ధిని చూసి ఓర్వలేకే నిందలు
ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న తీరుపై బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. గతంలో నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేసిన బిఆర్ఎస్ నేతలు, నేడు క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రజాపాలనను, నియోజకవర్గ అభివృద్ధిని చూసి ఓర్వలేకే ఇటువంటి అసత్య ప్రచారాలకు ఒడిగడుతున్నారని ఆరోపించారు.
పోలీస్ వ్యవస్థపై అనవసర రాజకీయాలు తగవు
శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని, తప్పు చేసిన వారు ఏ పార్టీకి చెందినవారైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపారు. జాతీయ జెండా గౌరవాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎమ్మెల్యేపై, ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలను బిఆర్ఎస్ శ్రేణులు మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుందని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, అయినవోలు దేవస్థానం చైర్మన్ కమ్మగొని ప్రభాకర్ గౌడ్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ ,చిట్టూరి రాజు సిద్ధం లక్ష్మీనారాయణ, మరుపట్ల అరుణ సాయికుమార్ ,తీగల సునిత,తో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

