
రాయపర్తి, ఆగస్టు 11 (యువ తెలంగాణ ): మండలం మైలారం గ్రామంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా కీలక పాత్ర గా మైలారం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రూ.9 లక్షల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన టౌన్ ఫీడర్‌ను పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి యశస్విని ఝాన్సీ రెడ్డి ప్రారంభించారు.రిబ్బన్ కట్ చేసి టౌన్ ఫీడర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యేకు విద్యుత్ శాఖ డీఈ, ఏఈ, సబ్ ఇంజనీర్లు, సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ.. మైలారం గ్రామానికి ప్రత్యేకంగా టౌన్ ఫీడర్ అందుబాటులోకి రావడంతో విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడటంతో పాటు, తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందన్నారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, విద్యుత్ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని తెలిపారు.నూతన టౌన్ ఫీడర్ అందుబాటులోకి రావడంతో మైలారం గ్రామ ప్రజల దీర్ఘకాలిక విద్యుత్ సమస్యలకు పరిష్కారం లభించనుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. ప్రత్యేక ఫీడర్ ద్వారా గ్రామానికి విద్యుత్ సరఫరా మరింత స్థిరంగా ఉండటంతో పాటు, రైతులు, గృహ వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరుతుందని అధికారులు తెలిపారు.
మైలారం గ్రామ విద్యుత్ సరఫరాలో నూతన టౌన్ ఫీడర్ కీలక మార్పుకు నాంది పలుకుతుందని ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు హమ్య నాయక్, సర్పంచ్ చిర్ర వేణు ,విద్యుత్ శాఖ డీఈ, ఏఈ, సబ్ ఇంజనీర్, లైన్మెన్లు, విద్యుత్ శాఖ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు, రైతులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

