
ఆర్టీసీ కార్మికుల ఐక్యతే మన ఆయుధం
“రిమూవల్” బెదిరింపులకు భయపడం..
ప్రభుత్వాన్నే రిమూవ్ చేసే శక్తి మాకుంది!
నా పంచాయతీ రెడ్లు,వెలమలతోనే
ఆర్టీసీ కార్మికులకు అన్నివేళలా అండగా ఉంటా
_టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

మహేశ్వరం, ఆగస్టు 05:
మహేశ్వరం ఆర్టీసీ డిపోలో బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు దేవళ్ళ సమ్మయ్య అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహేశ్వరం డిపో నూతన బీసీ కమిటీ ఆవిర్భావ కార్యక్రమంలో టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు.
ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మహేశ్వరం డిపోలోని బీసీ కార్మికులకు మనోధైర్యాన్ని కల్పిస్తూ, కార్మికుల సమస్యల పరిష్కారానికి తమ బృందం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీసీ రాజ్యాధికారం సాధించడమే లక్ష్యమని పేర్కొన్నారు. కార్మికులకు ఎలాంటి సమస్య వచ్చినా తీన్మార్ మల్లన్న తమ వెంటే ఉంటాడని స్పష్టం చేశారు.
ఆర్టీసీ బతకాలంటే ఐక్యతే ఏకైక మార్గం
గతంలో ఉన్న యూనియన్ల వైఫల్యం వల్ల ఆర్టీసీ అంటేనే కష్టం అనే స్థాయికి తీసుకువచ్చారని మల్లన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బతకాలంటే ఎలక్షన్లు లేదా అడుక్కోవడం ద్వారా సాధ్యం కాదని, కేవలం కార్మికుల ఐక్యత ద్వారానే సంస్థను కాపాడుకోగలమని ఆయన స్పష్టం చేశారు.

“రిమూవల్” అస్త్రాన్ని తిప్పికొడదాం
యాజమాన్యం కార్మికులను భయపెట్టడానికి వాడుతున్న “రిమూవల్” అనే పదాన్ని ఆర్టీసీ నుంచి శాశ్వతంగా తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. “కార్మికులను రిమూవ్ చేస్తారా? లేక మిమ్మల్ని సర్కార్ నుంచే రిమూవ్ చేయమంటారా?” అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. కార్మికులను బానిసల్లా చూడాలని చూస్తే సహించేది లేదని, ఎదురు తిరిగే శక్తి తమకుందని హెచ్చరించారు.
బీసీ అంటే “బిగ్ క్లాస్” – అందరినీ కలుపుకుని పోరాటం
బీసీ అంటే వెనకబడిన తరగతి కాదని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు అందరూ కలిసిన ఒక “బిగ్ క్లాస్” అని మల్లన్న కొత్త నిర్వచనం ఇచ్చారు. ఒక పెద్దన్న పాత్రలో బీసీలు ఉండి, తమ సోదర కులాలకు ఆపద వస్తే అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఇది కేవలం ఒక కులానికి సంబంధించిన పోరాటం కాదని, అణచివేతపై చేస్తున్న యుద్ధమని పేర్కొన్నారు.
రిటైర్డ్ కార్మికుల కోసం అల్టిమేటం
రిటైర్డ్ కార్మికులకు రావలసిన బెనిఫిట్స్ ఇవ్వకుండా, పెన్షన్లు తగ్గిస్తూ ప్రభుత్వం వారి నోట్లో మట్టి కొడుతోందని మల్లన్న మండిపడ్డారు. వారం రోజుల్లోగా రిటైర్డ్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మహేశ్వరం నుంచే మార్పు మొదలు
మహేశ్వరం డిపో ఇకపై ఒక ఆదర్శవంతమైన బీసీ యూనియన్ డిపోగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడి కార్మికులపై ఎలాంటి ఒత్తిడి లేదా హింస జరిగినా తాను నేరుగా రంగంలోకి దిగుతానని,అవసరమైతే చట్టసభల్లో కూడా పోరాడుతానని హామీ ఇచ్చారు.
2028 లక్ష్యం – బీసీల రాజ్యం
2028 నాటికి రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని, బీసీ ప్రభుత్వాన్ని తీసుకువస్తామని, అందులో ఆర్టీసీ కార్మికులను భాగస్వాములను చేస్తామని మల్లన్న ప్రకటించారు. తుమ్మ చెట్టు కింద జరిగిన ఈ పోరాటం రాష్ట్రమంతటా విస్తరిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం మహేశ్వరం నూతన డిపో గౌరవ అధ్యక్షులుగా నియమితులైన ఇంద్రకంటి రాకేష్ గౌడ్ ను పరిచయం చేస్తూ, ఆయన ఎల్లవేళలా కార్మికులకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం నూతన కమిటీని డిపో మేనేజర్‌కు పరిచయం చేశారు.
నూతన కమిటీలో డిపో చైర్మన్‌గా జె. వెంకటేష్, అధ్యక్షుడిగా కె. మల్లేష్, ప్రధాన కార్యదర్శిగా ఏ. వెంకటేశ్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కృష్ణ గౌడ్, సలహాదారులుగా వి. నరసింహ, వి. జయేందర్, కోశాధికారిగా నియమితులైన ప్రతినిధితో పాటు ఇతర కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో బీసీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియల్ ప్రధాన కార్యదర్శి పున్న హరి కిషన్,బహుజన్ వర్కర్ యూనియన్ చైర్మన్ సీహెచ్. సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు సాజిద్ మహమ్మద్, ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్, గ్రేటర్ హైదరాబాద్ జోన్ గౌరవ అధ్యక్షులు TVR ,తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా అధ్యక్షురాలు పటేల్ వనజక్కా, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నర్సయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్,కార్మిక విభాగం అధ్యక్షులు కె. శ్రీనివాస్,సహాయ కార్యదర్శి గిరిగాని భిక్షపతి గౌడ్, సౌభాగ్య, షాలిని తో పాటు మహేశ్వరం డిపోకు చెందిన ఆర్టీసీ కార్మికులు, బహుజన్ వర్కర్స్ యూనియన్ నాయకులు,తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.

