
పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రురు మండలం గుర్తూరు గ్రామ పరిధిలో ఉన్న రామసముద్రం చెరువును పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల యశస్విని రెడ్డి గారు సందర్శించి, చెరువు మత్తడి గండి, చెరువు కట్ట, నాలుగు తూముల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడిన ఎమ్మెల్యే గారు మరమ్మత్తు పనులను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు.
అనంతరం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు మాట్లాడుతూ.. గుర్తూరు–సొమారం గ్రామాల పరిధిలోని సుమారు 1,600 ఎకరాల ఆయకట్టుకు జీవనాధారంగా ఉన్న రామసముద్రం చెరువు రైతుల వ్యవసాయానికి అత్యంత కీలకమైందని అన్నారు. ప్రస్తుతం చెరువులో ఏర్పడిన మత్తడి గండి, చెరువు కట్ట దెబ్బతినడం, నాలుగు తూములు మరమ్మత్తులు అవసరమైన పరిస్థితిలో ఉండటంతో వాటిని అత్యవసరంగా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
చెరువులోని మత్తడి గండిని వెంటనే పూడ్చడంతో పాటు, చెరువు కట్టను బలోపేతం చేసి నాలుగు తూముల మరమ్మత్తు పనులకు అవసరమైన నిధులను త్వరలోనే మంజూరు చేసి పనులు ప్రారంభించాలని సంబంధిత శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఎలాంటి జాప్యం లేకుండా పనులు పూర్తి చేసి, రాబోయే సాగు సీజన్‌కు ముందే చెరువును పూర్తి స్థాయిలో వినియోగానికి సిద్ధం చేయాలని సూచించారు.
ఈ మరమ్మత్తు పనులు పూర్తయిన తర్వాత గుర్తూరు, సొమారం గ్రామాలకు చెందిన రైతులకు సాగునీటి సమస్యలు గణనీయంగా తగ్గడంతో పాటు సుమారు 1,600 ఎకరాల ఆయకట్టుకు నీటి అందుబాటు మెరుగుపడి వ్యవసాయ ఉత్పాదకత పెరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి సాగునీటి వనరును పరిరక్షిస్తూ రైతులకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు కట్టుబడి ఉందని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రవీంద్రాచారి, స్థానిక సర్పంచ్ విసంపల్లి కవిత బాలకృష్ణ, తొర్రురు పట్టణ అధ్యక్షులు ముద్దసాని సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, యువజన నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

