
ఆర్టీసీ ఎన్నికలకు బహుజన్ వర్కర్స్ యూనియన్ సమాయత్తం
ప్రతి ఆర్టీసీ ఉద్యోగి సమస్యే BWU ఎజెండా
గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడిగా TVR బాధ్యతలు
యూనియన్ నాయకులతో కీలక సమావేశం నిర్వహించిన టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్, ఆగస్టు 3:
తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) అనుబంధ బహుజన్ వర్కర్స్ యూనియన్ (BWU) ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎన్నికలకు సంబంధించి పార్టీ కేంద్ర కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అధ్యక్షత వహించగా, యూనియన్ రాష్ట్ర చైర్మన్ సంపత్ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు మొహమ్మద్ సాజిద్, నాయకులు, గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ ఆర్టీసీ గౌరవ అధ్యక్షుడిగా TVR బాధ్యతలు స్వీకరించారు. ఆయన నాయకత్వంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో యూనియన్ కార్యకలాపాలను మరింత విస్తృతం చేయాలని సమావేశం నిర్ణయించింది.
ఆర్టీసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బహుజన్ వర్కర్స్ యూనియన్ బలమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సూచించారు. ప్రతి డిపోలో బూత్ స్థాయి నుంచి యూనియన్ నిర్మాణాన్ని బలోపేతం చేయడంతో పాటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి పోరాట కార్యాచరణ రూపొందించాలని పిలుపునిచ్చారు.
ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న వేతనాలు, పదోన్నతులు, ఉద్యోగ భద్రత, పని పరిస్థితులు, సంక్షేమ పథకాలు వంటి అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి, వాటిని ఎన్నికల ప్రధాన అజెండాగా తీసుకుని ఉద్యోగుల ముందుకు వెళ్లాలని నాయకులకు సూచించారు. ప్రతి డిపోలో సమావేశాలు, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, ఉద్యోగులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహిస్తూ యూనియన్ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.
గ్రేటర్ హైదరాబాద్లో TVR నాయకత్వంలో యూనియన్ మరింత బలపడేలా సమిష్టిగా పనిచేయాలని, ఎన్నికల్లో బహుజన్ వర్కర్స్ యూనియన్ విజయానికి ప్రతి నాయకుడు బాధ్యతగా పనిచేయాలని మల్లన్న ఆదేశించారు.
ఈ సమావేశంలో టీఆర్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్, కార్మిక విభాగం అధ్యక్షులు సంకూరి శ్రీనివాస్, మహిళా విభాగం అధ్యక్షురాలు పటేల్ వనజక్క, రాష్ట్ర కార్యదర్శి కొమ్ముల ప్రవీణ్ రాజ్, సహాయ కార్యదర్శి గిరి గాని బిక్షపతి గౌడ్, స్టేట్ ఆఫీస్ కోఆర్డినేటర్ లింగం యాదవ్, బహుజన్ వర్కర్స్ యూనియన్ నాయకులు, గ్రేటర్ హైదరాబాద్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

