
విద్యార్థుల ఐక్యత ముందు కేంద్ర ప్రభుత్వం తలవంచింది
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల పోరాట విజయమే
తొలి నుంచి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం పూర్తిగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థుల విజయమని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఈ విజయానికి ఏ రాజకీయ పార్టీ ప్రమేయం లేదని, ఇది కేవలం విద్యార్థుల ఐక్యత, పట్టుదల, పోరాట స్ఫూర్తి సాధించిన విజయమని స్పష్టం చేశారు.
విద్యార్థులు సంకల్పిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని, ఎంతటి ప్రభుత్వాన్నైనా ప్రజాస్వామ్యబద్ధమైన ఉద్యమాల ద్వారా తలవంచించగలరని ఈ ఉద్యమం మరోసారి నిరూపించిందని అన్నారు. విద్యార్థి శక్తి ముందు అధికార పార్టీ అహంకారం నిలవలేదని పేర్కొన్నారు.
ఈ ఉద్యమం ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలకు ఒక గట్టి హెచ్చరిక అని తీన్మార్ మల్లన్న అన్నారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడే ప్రభుత్వాలు ఇకపై ప్రజల ఉద్యమాలకు మరీ ముఖ్యంగా విదార్థి కేంద్రంగా నడిచే ఉద్యమాలకు భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.
కాక్రోక్ జనతా పార్టీ, విద్యార్థులు చేపట్టిన ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొదటి రోజు నుంచే పూర్తి మద్దతు అందిస్తోందని గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా కాక్రోక్ జనతా పార్టీ చేపట్టే ప్రతి ప్రజా ఉద్యమానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అండగా నిలుస్తుందని, ప్రజల హక్కుల కోసం జరిగే ప్రతి పోరాటంలో తమ పార్టీ భాగస్వామిగా ఉంటుందని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు.
