
వర్షాకాల సమావేశాల్లో వాయిదా పడిన డీలిమిటేషన్,వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లులు
ప్రత్యేక సమావేశాలపై కసరత్తు!
- దేశ రాజకీయాన్ని మార్చేయాలనుకున్న కేంద్రం వ్యూహానికి బ్రేక్ : జెన్-జీ నిరసనలతో వెనక్కి తగ్గిన మోదీ ప్రభుత్వం!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను వేదికగా చేసుకుని దేశ రాజకీయాన్ని శాశ్వతంగా మార్చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యూహాత్మక ప్రణాళిక అనూహ్యంగా గందరగోళంలో పడింది.డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ అమల్లో కీలకమైన నిబంధనలు, అలాగే ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ వంటి కీలక బిల్లులను ఈ సమావేశాల్లోనే ఆమోదింపజేసుకోవాలని కేంద్రం భావించింది.దీనికోసం అవసరమైన రాజకీయ మద్దతును సమకూర్చుకోవడంతో పాటు సంఖ్యాబలాన్ని సరిచూసుకుని రంగం సిద్ధం చేసుకుంది. అయితే, పార్లమెంట్ సమావేశాల ఆరంభంలోనే అనూహ్యంగా తలెత్తిన జెన్జీ ఆందోళనలు, విపక్షాల నిరసనలు కేంద్ర ప్రభుత్వ ముందస్తు లెక్కలను తలకిందులు చేశాయి.
జెన్జీ విద్యార్థుల ఆందోళనతో మారిపోయిన రాజకీయం
సమావేశాల ప్రారంభ రోజే పార్లమెంట్ వెలుపల విద్యార్థులు నిర్వహించిన నిరసనలపై పోలీసులు తీవ్రస్థాయిలో లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పేపర్ లీకేజీలు, పరీక్షల నిర్వహణలో లోపాలపై ఆగ్రహంతో ఉన్న యువత వీధుల్లోకి రావడం, వారికి విపక్షాలు తోడవడంతో ఉభయ సభలు తీవ్ర గందరగోళంలో మునిగిపోయాయి.యువతలో పెరిగిన ఆగ్రహాన్ని చల్లార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే యాంటీ-లీకేజ్ బిల్లును తీసుకొచ్చి సభలో ఆమోదించినప్పటికీ.. క్షేత్రస్థాయిలో విద్యార్థుల ఆందోళనలు, జెన్-జీ తీవ్ర నిరసనల వేడి కొనసాగుతోంది.
రాజ్యాంగ సవరణలకు సరైన సమయం కాదు!
ప్రస్తుతం తీవ్రమైన రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లులను ప్రవేశపెట్టడం వ్యూహాత్మక పొరపాటు అవుతుందనే ముగింపునకు కేంద్ర పాలకుల వ్యూహకర్తలు వచ్చారు. ఇప్పటికే విద్యార్థి లోకం, యువత నుంచి ఎదురువుతున్న సెగను తట్టుకుంటున్న సమయంలో.. దక్షిణాది రాష్ట్రాలు, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉండే డీలిమిటేషన్, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ వంటి వివాదాస్పద బిల్లులను రగిలిస్తే అది దేశవ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ప్రజాందోళనలకు దారితీసే ముప్పు ఉందని భావిస్తున్నారు.
రిస్క్ ఎందుకని వెనక్కి తగ్గుతున్న ప్రధాని మోదీ
దేశంలో ఇప్పటికే యువతలో అసంతృప్తి వాతావరణం నెలకొని ఉండటంతో,రాజకీయంగా రిస్క్ తీసుకోవడం సరికాదని కేంద్రం అడుగు వెనక్కి వేసినట్లు సమాచారం. ఒకవైపు జెన్-జీ ఆగ్రహం, మరోవైపు విపక్షాలు పార్లమెంట్లో అనుసరిస్తున్న కఠిన వైఖరి కారణంగా.. ఈ సమావేశాల్లోనే ప్రతిష్టాత్మక బిల్లులను నెగ్గించుకోవాలనే ఆలోచనను తాత్కాలికంగా పక్కనబెట్టారు.ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలను చల్లార్చి, సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడడమే ప్రభుత్వ ప్రాధాన్యతగా మారింది. వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం, దేశంలో పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగిన తర్వాత ఒక ప్రత్యేక పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కేంద్రం ఉంది. ఆ ప్రత్యేక సమావేశాల ద్వారానే డీలిమిటేషన్, వన్ నేషన్ – వన్ ఎలక్షన్ బిల్లులపై సమగ్ర చర్చ జరిపి, ఆమోదముద్ర వేయించుకోవాలని భావిస్తున్నారు.

