
టీ.ఆర్.పీ కార్యాలయం
హైదరాబాద్
యువతే పార్టీకి వెన్నెముక
గ్రామ స్థాయి నుంచి పోరాట స్ఫూర్తిని పెంచాలి
_పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
హైదరాబాద్: తెలంగాణ రాజ్యాధికార పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ యువజన విభాగంతో టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రాష్ట్ర,జిల్లా నాయకులతో పార్టీ విస్తరణ, యువత పాత్ర, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ, యువతే సమాజ మార్పుకు అసలైన శక్తి అని అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలను ప్రతి గ్రామం, ప్రతి ఊరు, ప్రతి కళాశాలకు తీసుకెళ్లే బాధ్యత యువజన విభాగంపైనే ఉందన్నారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, యువతలో రాజకీయ చైతన్యాన్ని పెంచాలని సూచించారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో యువజన కమిటీలను బలోపేతం చేయాలని ఆదేశించారు. సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగిస్తూ పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, యువతను పెద్ద ఎత్తున పార్టీలోకి ఆహ్వానించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా విద్య, ఉద్యోగాలు, బీసీల రాజ్యాధికారం, సామాజిక న్యాయం వంటి ప్రజా సమస్యలపై యువజన విభాగం ముందుండి ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో క్రమశిక్షణ, అంకితభావం, ప్రజలతో నిరంతర అనుబంధమే విజయానికి పునాది అని మల్లన్న స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంలో యువజన విభాగం కీలక పాత్ర పోషించాలని మల్లన్న పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి గంగాధర్ లింగాల,ఉపాధ్యక్షులు ఎల్లబోయిన ఓదెలు యాదవ్,క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్,స్టేట్ ఆఫీస్ కో ఆర్డినేటర్ లింగం యాదవ్ రాష్ట్ర,జిల్లా యువజన విభాగం నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

