
బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావుపై టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
నిజామాబాద్లో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హరీష్ రావు ఇటీవల చేసిన తమిళనాడు పర్యటనపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. క్షుద్ర పూజలకు ప్రసిద్ధి చెందిన దేవాలయాలను హరీష్ రావు ఎందుకు సందర్శించారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని అన్నారు. ఈ అంశంపై తాను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లీగల్ నోటీసులు పంపించడం ద్వారా అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. నోటీసులు పంపడం కంటే ప్రజల సందేహాలకు సమాధానం చెప్పడం ముఖ్యమని వ్యాఖ్యానించారు.
ఈ..సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యత ఏమిటో ఇప్పటికే ప్రజలకు తెలిసిపోయిందని, నీటి ఒత్తిడికి బ్యారేజీలే దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భారీ లోపాలు జరిగాయని, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం గోదావరిలో కలిసిపోయిందని ఆరోపించారు. సీఎంఆర్ వ్యవహారంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్, తప్పు చేసిన వారిని ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులకు కూడా ఇదే విషయాన్ని తాను స్పష్టంగా చెప్పినట్లు వెల్లడించారు. అలాగే కేటీఆర్ చేపట్టే పాదయాత్ర వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం ఉండదని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి 80 శాతం స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

